Monday, August 20, 2007

ఒక నిశ్శబ్ద సముద్రం ఒడ్డున




అలా కూచుని ఉంటాను

ఈ గాలీ మాట్లాడదు
ఈ నేలా పలకదు
ఈ చెట్టూ కదలదు ఈ చిలుకా పాడదు

గాఢంగా
ఓ ఘనీభూత నిశ్శబ్దం నన్నావరించి ఉంటుంది

నేనప్పుడు
ఊరవతల పాడుపడిన సత్రపు మొండిగోడలా ఉంటాను
నడివేసవి మధ్యాహ్నం కదలాడని గాలి బరువులా ఉంటాను
కాలిపోయిన కలల వేడికి మాడిపోయిన దిగులు చూపులా ఉంటాను

ఉన్నట్టుండి క్షితిజరేఖపై ఓ బుల్లి పడవేదో కదులుతుంది
మెదడు మూలల్లో తళుక్కుమని మెరిసే నీ జ్ఞాపకం

ఈ గాలి గాలంతా హోరెత్తిపోతుంది
వానకు తడిసిన మట్టి పరిమళం లోంచీ ఈ నేల నా పాటను ఎగరేస్తుంది
వొయ్యారంగా ఊగిపోయే చెట్టు తన చిగురాకుల లావణ్యంలో నా పాటను మెరిపిస్తుంది
చిలుకల గుంపులన్నీ బారులు బారులుగా ఆకాశంలో నా పాటను రాస్తూ పోతాయి

అప్పుడు నేనెలా ఉంటానో తెలుసా

కొండల్ని తొలుచుకుని దూకే ఉధృత జలపాతంలా ఉంటాను
లక్ష నక్షత్రాలు పొదిగిన ఆకాశంలా ఉంటాను
వేలవేల దీపాలు కట్టి వెలిగించిన తోరణంలా ఉంటాను

సరిగ్గా అప్పుడే ఎవరో నా భుజంపై చేయి వేసినట్టు తోస్తుంది
వెనక్కి తిరిగి చూస్తే
స్వచ్ఛంగా నవ్వుతూ
దగ్గరిగా స్పృశిస్తూ
అంతటా అన్నిటా తానే అయిన నా పాట.

6 comments:

కొత్త పాళీ said...

భానుమూర్తిగారూ,
మీ కవిత్వం బాగుందండీ. పూర్తిగా ఆస్వాదించడానికి ఇంకా తీరిగ్గా చదవాలి. తెలుగు బ్లాగు గుంపుకి స్వాగతం.
ఇంజనీరింగ్ ఆచార్యు లయ్యుండి ఇంత చిక్కటి కవిత్వాన్ని పండించడం అరుదైన విషయం. ఆర్యీసీలో మా ఆచార్యులొకరు మెషిన్లమీద తెలుగులో కవిత్వం రాస్తుండేవారు. అక్కడే నా సహాధ్యాయి విన్నకోట రవిశంకర్ మంఛి కవిగా పేరుపొందాడు - మీరు చదివే ఉంటారు.
ఇంజనీరింగులో ఏ సబ్జక్టు చెబుతారు మీరు?

జాన్‌హైడ్ కనుమూరి said...

భానుమూర్తిగారు,
ప్రతిష్టాత్మకమైన రజనీకుందుర్తి అవార్డు పొందిన మీరు మళ్ళీ కవిత్వం వైపు మళ్ళినందుకు ఆభినందిస్తున్నాను.
కవిత్వాన్ని ఔషదంగా సేవిస్తున్నాను అంతే.

త్వరలో మీ కవిత్వంపై రాయటానికి ప్రయత్నిస్తాను.

అభినందనలతో

భాను said...

కొత్తపాళీ గారికి,

ధన్యవాదాలు.మీ పేరు తెలియకపోవడం వల్ల అలా సంభోధించాల్సి వచ్చింది.మన్నించాలి.నేను ఆర్యీసీలో యంటెక్ చేసేటప్పుడు విన్నకోట రవిశంకర్ బీటెక్ చేసేవాడు. నాకు మిత్రుడు. ఆతని కవిత్వం కూడా చిక్కని అనుభూతి ప్రధానంగా ఉంటుంది. ముఖ్యంగా అతను తన తల్లి మీద రాసిన "అమ్మా నీ జ్ఞాపకం" అనే కవిత నాకు చాలా ఇష్టం.

భాను said...

కనుమూరి గారికి,

ధన్యవాదాలు.మీ విమర్శ కోసం ఎదురు చూస్తుంటాను

కొత్త పాళీ said...

please mail me at kottapali at yahoo dot com.

thanks

రాధిక said...

భావపు లోతుని చూపెట్టగలిగే అద్భుతమైన నేర్పు వుంది మీ కవితల్లో.