ఇప్పుడు కాదు
కలల జలతారు కళ్ళను కప్పిన కాలేజీ రోజుల్లో
ఒక కప్పు టీ
ఒక పఫ్ సిగరెట్
తనియని తలపులు తెలియని పిలుపులు
మరిచిపోలేని గుర్తు తెలీని జ్ఞపకాలు
ఓహ్
ఇప్పుడు కాదు
కలల జలతారు కళ్ళను కప్పిన కాలేజీ రోజుల్లో
ఫిల్టర్ సిగరెట్ పొగల్లోంచి వడగట్టిన కాలం
కాఫీ కప్పుల్లోంచి ప్రవహించిన కాలం
అతి శీతాకాలపు అర్ధరాత్రి ఇరానీ హోటల్ లతా గొంతులో
వణికి గడ్డ కట్టిన కాలం
ఇప్పుడు కాదు
కలల జలతారు కళ్ళను కప్పిన కాలేజీ లేజీ రోజుల్లో
లేడిపిల్లల్లాంటి ఆడపిల్లలు తిరిగే సుందరవనం లేడీస్ హాస్టల్
గుమ్మం ముందర గుండెలు పరచి
వేచి వేచి వేచిన వేడి వేడి నిట్టూర్పుల వెన్నెల రాత్రుల విరహ తాపాల వ్యథల వింతకథల కాలం
ఇప్పుడు కాదు
కలల జలతారు కళ్ళను కప్పిన కాలేజీ క్రేజీ రోజుల్లో
స్వప్నాల సంచులు
కలవరపు రాగాన్ని గానం చేసే విచిత్ర విపంచులు
ఈ కళ్ళు యవ్వనపు జలపాతాలు
ఒక్క చిరునవ్వు రెక్కలపై
రాత్రి నిద్రంతా స్వప్నలోక సంచారం చేసిన
మ్యాజిక్ కార్పెట్ లాంటి కాలేజీ రోజుల్లో
వొయ్యారాలు వొంపులు
సోయగాలు సొంపులు
లేళ్ళలాంటి సెలయేళ్ళలాంటి
నడుములు నడకలు
ఘల్లుమని గజ్జలు ఝల్లుమని గుండెలు
గులాబీపూల పరిమళాల చెంపలు
క్లాసురూములో సైన్సు పాఠాల మధ్య కలుసుకున్న కనులలోంచి కలల వర్షాలు
నిప్పులాంటి యవ్వనం గుప్పుమన్న క్షణాలు
ఇప్పుడు కాదు
రెక్కలు విదల్చి కాలం సీతాకోకచిలుక
కళ్ళలో పుప్పొడి చల్లిపోయిన కాలేజీ రోజీ రోజుల్లో
వయొలిన్ తీగల్లాంటి వయ్యారపు రోజులపై
కాలం కమాను పాడిన కమనీయపు గానాలు
గుండెలు గులాబి గుత్తులై పరిమళించిన యవ్వన వనాలు
ఒక వీనస్ డి మెలో లైలా కలసికట్టుగా ఏలిన కలల సామ్రాజ్యాలు
వైజయంతిమాల కళ్ళల్లోంచి వెయ్యేళ్ళ కిందటి జ్ఞాపకాలు
ఒక కృష్ణశాస్త్రి ఒక తిలక్ ఒక దేవదా ఒక మజ్నూ
పరకాయప్రవేశం చేసి ఈ తనువు జ్వలించిన తన్మయాలు
ఇప్పుడు కాదు
కలల జలతారు కళ్ళను కప్పిన కాలేజీ రోజుల్లో
(ప్రతి వ్యక్తి జీవితంలోనూ మరచిపోలేని బంగారు రోజులు కాలేజీ రోజులు.సరదాలూ,సంతొషాలూ తప్ప బాధ్యతలూ,బంధాలూ లేని ఆ రోజుల్ని తల్చుకుని)
భాను(1984)
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
శ్రావణపూర్ణిమ(రాఖీ) శుభాకాంక్షలు.
@భాను గారు
నేను తెలుగుతో ఇలా ఎప్పుడు ఆటలాడుకుంటానో...! చదవడం మొదలుపెడితే సముద్రంలో చేరడానికి ఆరాటపడుతూ ఉరకలుతీసే నదిలా ఉంది మీ కవిత... పూర్తయ్యే వరకు ప్రవాహ వేగంతో చదవక తప్పలేదు... :-)"కాలం కమాను పాడిన కమనీయపు గానాలు" అంతే అర్ధం కాలేదండి... 1984లో రాసారా ఇది?! అప్పటికి నేను మాటలు కూడ నేర్చి ఉండను!
కొన్ని భావాలు దశాబ్ధాలు మారినా అలాగే ఉండిపోతాయి. ఈ కవితలోని భావాలు అలాంటివే! వాటిని చాలా బాగా చెప్పారు.
Post a Comment