మెదడు మొహంజొదారోలో తవ్వకాలు సాగిస్తున్నాను
ఈ అవ్యక్త పరిమళపు జన్మ రహస్యం కోసం
అక్షాంశ రెఖాంశాల మధ్య
తమను తాము విభజించుకున్న దేశాలు మనవి
ఇక్కడ ఎవడూ ఇంకొకడి వైపు కన్నెత్తి చూడడు
ఇక్కడ కన్నుల్లో అనుమానం అపనమ్మకం తప్ప
మరే భావమూ పలకదు
ఏ భూతం
ఏ కాలం
ఏ భూతకాలం మనల్ని కలిపిందో
మెదడు మొహంజొదారోలో తవ్వకాలు సాగిస్తున్నాను
ఈ అవ్యక్త పరిమళపు జన్మ రహస్యం కోసం
హఠాత్తుగా నా తలుపు తట్టిన అతి కోమలాంగుళల కోసం
అంతు పట్టని కీకారణ్యాలు గాలిస్తున్నాను
రక్కసి ముళ్ళ మధ్య రోజా కోసం
శిల్పాలు చెక్కే చేతుల్ని శిలువ వేసే ఈ నేలలో
ఈ శిలను స్ప్రుశించిన ఉలి కోసం వెతుకుతున్నాను
జఢంగా పడి ఉన్న బండ రాళ్ళ మధ్య జక్కన కోసం
మెదడు మొహంజొదారోలో తవ్వకాలు సాగిస్తున్నాను
ఈ అవ్యక్త పరిమళపు జన్మ రహస్యం కోసం
మౌనంగా వెతికితే వెర్రితనం
వెర్రిగా అరిస్తే అభ్యుదయం
విలువలు తారుమారైన ఈ వ్యవస్థలో
ఈ వెర్రివాడిని కలవరించే వ్యక్తి కోసం
ఊరేగించే శవం పైన విసిరేసే పైసల కోసం
పరుగెత్తే పసిపిల్లల మూక ప్రపంచం
దూరంగా నిలబడి మౌనంగా చూసే నా కోసం
దగ్గరవాలని ప్రయత్నించే నీ కోసం
మెదడు మొహంజొదారోలో తవ్వకాలు సాగిస్తున్నాను
ఈ అవ్యక్త పరిమళపు జన్మ రహస్యం కోసం
భానుమూర్తి(1980)
1 comment:
అక్షాంశ, రెఖాంశాల మద్య విభజించుకున్న ప్రపంచం మనది ఎంత అద్భుతమైన వర్ణన.
వూరేగించే శవం వెనుక డబ్బులేరుకునే పిల్లల మూక ఎంత చక్కని పదచిత్రం.
మీనుంచి ఇంకా మంచి కవితలకై ఎదురుచూస్తుంటాను.
వీలైతే విసిట్ చెయ్యండి. కామెంట్ చెయ్యండి.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
Post a Comment