Monday, October 22, 2007

నాకు నేను, నాకై నేను రాసుకున్న లేఖ

రేయ్ భానూ,

అవ్యక్తపుటాలోచనలూ,అస్పష్టమైన కలలూ,అంతుపట్టని ఉద్రేకాలూ ఎక్కడికి నడిపిస్తాయి నిన్ను? ఎడతెగని,కడలేని నీ నిరంతర యాత్ర ఏ స్వప్న సీమా సౌందర్యం కోసం? నాకు తెలుసు, నీ హృదయం విచిత్ర విచిత్ర వర్ణాల ఊహల ఇంద్రధనుస్సులు చిత్రీకరించుకున్న ఆకాశం;కలల పువ్వులు నిండుగా విరబూసిన పూలతోట. నాకు తెలుసు - నీ హృదయం తీరని వాంఛలతో, అలౌకికమైన కాంక్షలతో తెలియని తీరాలనుంచి వినవచ్చే ఏ పిలుపులకో చలించి,గాలి తాకిడికే ఉలిక్కి పడే,ఊగిసలాడే ఒక రసజ్వాల. ఒక ఉన్మత్త సముద్రం.
నిదురలో నవ్వే పసిపాప పెదవులపై తొణికిసలాడే అమాయకత్వాన్ని నువ్వు ప్రేమిస్తావు. మంచు తుంపరల వెనక మెల్లగా కళ్ళు విప్పే మల్లె పూలని నువ్వు ప్రేమిస్తావు.ఇంద్రియానందాన్నధిగమించి అతీతమైన దైవత్వాన్ని అందుకునే దేహసౌందర్యాన్ని నువ్వు ఆరాధిస్తావు. అర్ధరాత్రి ఆకాశంలో నక్షత్రాలు మాట్లాడుకునే రహస్యాల్ని నువ్వు శోధిస్తావు.జీవితాన్ని నువ్వు దోసిళ్లతో అమృతధారలాగా ఆస్వాదిస్తావు. మరి దేని కోసం వెర్రిగా వెతుకుతావు?

అవును.నేనర్థం చేసుకోగలను.స్వర్గసీమా ప్రాంగణంలోనుంచీ తేలి వచ్చే అప్సరల అమరగానం కోసం ప్రతి గొంతు వైపూ ఆశగా చూస్తావు. హాయిగా పుష్పించే చిరునవ్వుల కోసం ప్రతి పెదవి వైపూ ఆశగా చూస్తావు. చల్లగా,నిండుగా పలకరించె దయామయ దృష్టుల కోసం ప్రతి కంటినీ దీనంగా పరిశీలిస్తావు. మెత్తగా,తల్లిలా లాలించే వొడి కోసం ప్రతి చేతుల్నీ అభ్యర్థిస్తావు. నాకు తెలుసు.నువ్వు ప్రేమిస్తావు. నీ హృదయాన్ని లోకం ముందు హాయిగా విసిరేస్తావు. నిజంగా నువ్వు ప్రేమిస్తావు.

నువ్వు దేవున్ని ప్రేమిస్తావు.శిలువ పై జీసస్ స్రవించిన రక్తాన్ని తలచుకుని నీ కళ్లు రెండు సముద్రాలవుతాయి. నీ హృదయం ఒక వర్షామేఘమే అవుతుంది. కైలాస శిఖరాగ్రాన తాండవించే నటరాజును తలచుకుని నీ శరీరం పులకించిపోతుంది. నీ గుండె పొంగే సముద్రమే అవుతుంది. ప్రచండ ఝంఝానిలమే అవుతుంది.అపార కరుణామయుడయిన అల్లాను తలచుకుని నీ హృదయం కృతజ్ఞతతో చేతులు జోడిస్తుంది.నీ శిరస్సు అవనతమవుతుంది. అవును, నువ్వు దేవున్ని ప్రేమిస్తావు.మసీదును ప్రేమిస్తావు.మందిరాన్ని ప్రేమిస్తావు.చర్చిని ప్రేమిస్తావు.అవును, నువ్వు మనుషుల్ని ప్రేమిస్తావు.

ఒరేయ్ వెధవా ___ నిజంగా చెబుతున్నాను. ఈ లోకం ద్వారా నిన్ను నువ్వు ప్రేమిస్తావు.
భాను(1990)

Friday, September 14, 2007

నీటి నీడ


నువ్వు నాకెప్పటికీ ఒక స్వప్నమే

అసహాయంగా రాలిపడే అక్షరాల మధ్య
నువ్వింకా అవ్యక్తమే

గాలి కౌగిలింతలే తప్ప ఎట్లా నిన్ను స్పృశించేది

నువ్వెప్పటికీ ఒక నైరూప్య సౌందర్యమే

గింజుకునీ కలవరపడీ తపించీ
నన్ను నేను దగ్ధం చేసుకునీ
నన్ను నేను ధ్వంసం చేసుకునీ

ఎప్పటికీ ప్రసారం చేయబడని కాంతి అనుభవమే

Friday, September 7, 2007

చార్ సౌ షహర్


(ఈ గేయం 1991లో రాసింది.హైదరాబాద్ మహానగరం 400 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రంజని సంస్థ నిర్వహించిన పోటీలో ప్రశంస పొందింది. అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పేమీ లేదనే అనుకుంటా.)

తళుకు తగరపు వయ్యారపు నవ్వులూ
జిలుగు మెరుపుల కాగితపు పువ్వులూ
తోరణాలు తోరణాలుగా పరచుకున్న నాలుగు శతాబ్దుల కాలమూ

ఇదేనా మహానగరం?

ప్రతి రోడ్డు కూడలి లోనూ
ప్రజల్ని పరామర్శించే పెద్ద పెద్ద హోర్డింగులూ
ప్రతి సాయంత్రమూ
పార్కుల్లో పబ్లిక్ గార్డెన్లో రవీంద్రభారతిలో
హోరెత్తే మీటింగులూ

కామరూపం ధరించిన రాక్షసుడిలాగా
నగరం తనను తాను అలంకరించుకుంటోంది

దిక్కు తెలియక తిరనాలలో తప్పిపోయిన అనామకునిలా
అన్నింటిలోనూ వెతుకుతున్నాను
నగర జీవన స్పర్శ కోసం_
ఎక్కడా తగలదు

మెరుపుల తోరణాలూ వెలుతురు కిరణాలూ
రంగురంగుల స్వప్నాలూ సరే
దాచబడ్డ సత్యాల్ని చెప్పేదెవరు?
గాయపడ్డ హృదయాన్ని విప్పేదెవరు?

చూసీచూడనట్టు ప్రవహించే మూసీ నది చెబుతుందా?
అజ్ఞానం పేదరికం మరిపించే మత్తు మతం
ఆడుకున్న నెత్తుటి వసంతాలనుండీ ఇంకా మేలుకోలేదు మూసీ*

నయగారపు కవ్వింతల నటనల మెహందీ చెబుతుందా?
ఆకలి పన్నిన కుట్రలోంచీ ఇంకా మూల్గుతూనే ఉంది మెహందీ
చీకటిలో నాగరికత తనకంటించిన మరకలనే
వెలుతురులో నగరం అసహ్యించుకోవడం
అర్థం కాని అయోమయంలో అలమటిస్తూంది మెహందీ


కాలం ఘనీభవించి కట్టడంగా మిగిలిపోయిన
చార్మినార్ మాత్రం ఏం చెప్పగలుగుతుంది?
నగరం నాలుగు దిక్కులకీ తాను సాక్షి అయినందుకు
కళ్ళు పొడుచుకుంటోంది

ప్రభుత్వాలూ ప్రతిపక్షాలూ
విడివిడిగా కలివిడిగా చేపట్టే ఉమ్మడి విధ్వంసక కార్యాల్లో
ఏ కాలిపోయిన బస్సులు చెబుతాయి
ఏ ఆగిపోయిన రైళ్ళు చెబుతాయి
పోగొట్టుకున్న ఉద్యోగాల గురించీ
దక్కని ఆఖరి చూపుల గురించీ
ఎదురు చూపుల గుప్పిట్లో గజగజలాడే గుండెల గురించీ

ఎవరూ ఏమీ చెప్పరు
ఏదీ ఏమీ పలకదు

సజావుగా జీవితం సాగుతున్నట్టే ఉంటుంది
ఉదయసాయంత్రాలు
ఆఫీసులకీ ఇంటికీ మధ్య సాగే మహాప్రవాహం
ఒక మహా యుద్ధాన్ని తలపిస్తూనే ఉంటుంది
నగరం నాగుపాము పడగ మీద మెరిసిపోయే మణి లాగా
బిర్లాటెంపుల్ ధగధగలాడుతూనే ఉంటుంది
పెంటకుప్పల మధ్యా చింకిపాతల మధ్యా
కిళ్ళీమరకల మధ్యా సిగరెట్ పీకల మధ్యా
ఇరానీహోటల్ వంటగది సొరంగాల మధ్యా
అనాగరిక బాల్యం అజ్ఞానపు యవ్వనంలోకి వికసిస్తూనే ఉంటుంది

*******
బాబూ
ఇది నగరం
మాయలాడి మహానగరం
మాయలేడి మా మహానగరం
చూడగలిగే కళ్ళే నీకుంటే
టాంక్ బండ్ మీద పల్లీలమ్ముకునే కుర్రాడి కళ్ళల్లో
నగరజీవితం తన నగ్నత్వాన్ని ఆవిష్కరిస్తుంది.

* (1990-91 లో ఒక నెల పాటు భయానక మతఘర్షణలు జరిగాయి)

Sunday, September 2, 2007

రాత్రి కురిసిన వర్షం


అర్ధరాత్రి చెంపలపై ఆత్మీయపు తడి తగిలి లేస్తే
కిటికీ అవతల వర్షం కురుస్తోంది
తెల్లని పువ్వయి విచ్చుకున్న ఆకాశపు హృదయం నుండీ
సౌహార్ద్రం జాల్వారినట్లు వాన
జననాంతర సౌహృదాలేవో జలజలా మేల్కొలుపుతుంది

అర్ధరాత్రి కిటికీ లోంచీ వర్షాన్ని చూస్తుంటే
తెలియని రసప్రపంచపు రహస్య ద్వారమేదో తెరచుకున్నట్లుంటుంది
నీలిరంగు చీకటిలో నీడలు కదలాడినట్లు
మార్మిక ఛాయలేవో మనసును కలవరపెడతాయి

తడిసిన మట్టి వాసనతో గాలి శరీరాన్ని చుడితే
సాంద్రమూ సన్నిహితమూ అయిన స్వప్నమేదో స్పర్శించినట్లుంటుంది

సగం తెరిచిన కిటికీ రెక్కపై చిత్రమైన సంగీతాన్ని ధ్వనించే చినుకులు
నిద్రకూ మెలకువకూ మధ్య నిలిచి
నిర్ణిద్ర గానాన్ని వినిపిస్తున్నట్లుంటుంది
మంద్రస్థాయిలో వినిపించే జంత్రవాయిద్యపు సంగీతవిభావరిలో
తన్మయమై పోయిన మనస్సు
తెలియకుండానే పొలిమేర దాటి నిద్రలో జోగుతుంది
తెరలు తెరలుగా దృశ్యం అదృశ్యంలోకి మాయమయినట్లుగా

తెల్లారి లేచి చూస్తే_
అప్పుడే తలంటు పోసుకుని కురులారబెట్టుకుంటున్న జవ్వనిలాగా
పచ్చని కాంతితో ప్రపంచం కిటికీ లోంచీ స్వఛ్చంగా నవ్వుతుంది
రాత్రి అనుభవాల్ని గుండెలో జ్ఞాపకాలుగా పదిలపరచుకున్నట్టు
గడ్డిపూల మీద మెరిసే నీటిబిందువులు.

Monday, August 27, 2007

కలల జలతారు కళ్ళను కప్పిన కాలేజీ రోజుల్లో

ఇప్పుడు కాదు
కలల జలతారు కళ్ళను కప్పిన కాలేజీ రోజుల్లో

ఒక కప్పు టీ
ఒక పఫ్ సిగరెట్
తనియని తలపులు తెలియని పిలుపులు
మరిచిపోలేని గుర్తు తెలీని జ్ఞపకాలు
ఓహ్
ఇప్పుడు కాదు
కలల జలతారు కళ్ళను కప్పిన కాలేజీ రోజుల్లో

ఫిల్టర్ సిగరెట్ పొగల్లోంచి వడగట్టిన కాలం
కాఫీ కప్పుల్లోంచి ప్రవహించిన కాలం
అతి శీతాకాలపు అర్ధరాత్రి ఇరానీ హోటల్ లతా గొంతులో
వణికి గడ్డ కట్టిన కాలం

ఇప్పుడు కాదు
కలల జలతారు కళ్ళను కప్పిన కాలేజీ లేజీ రోజుల్లో

లేడిపిల్లల్లాంటి ఆడపిల్లలు తిరిగే సుందరవనం లేడీస్ హాస్టల్
గుమ్మం ముందర గుండెలు పరచి
వేచి వేచి వేచిన వేడి వేడి నిట్టూర్పుల వెన్నెల రాత్రుల విరహ తాపాల వ్యథల వింతకథల కాలం

ఇప్పుడు కాదు
కలల జలతారు కళ్ళను కప్పిన కాలేజీ క్రేజీ రోజుల్లో

స్వప్నాల సంచులు
కలవరపు రాగాన్ని గానం చేసే విచిత్ర విపంచులు
ఈ కళ్ళు యవ్వనపు జలపాతాలు
ఒక్క చిరునవ్వు రెక్కలపై
రాత్రి నిద్రంతా స్వప్నలోక సంచారం చేసిన
మ్యాజిక్ కార్పెట్ లాంటి కాలేజీ రోజుల్లో

వొయ్యారాలు వొంపులు
సోయగాలు సొంపులు
లేళ్ళలాంటి సెలయేళ్ళలాంటి
నడుములు నడకలు
ఘల్లుమని గజ్జలు ఝల్లుమని గుండెలు
గులాబీపూల పరిమళాల చెంపలు
క్లాసురూములో సైన్సు పాఠాల మధ్య కలుసుకున్న కనులలోంచి కలల వర్షాలు
నిప్పులాంటి యవ్వనం గుప్పుమన్న క్షణాలు


ఇప్పుడు కాదు
రెక్కలు విదల్చి కాలం సీతాకోకచిలుక
కళ్ళలో పుప్పొడి చల్లిపోయిన కాలేజీ రోజీ రోజుల్లో

వయొలిన్ తీగల్లాంటి వయ్యారపు రోజులపై
కాలం కమాను పాడిన కమనీయపు గానాలు
గుండెలు గులాబి గుత్తులై పరిమళించిన యవ్వన వనాలు
ఒక వీనస్ డి మెలో లైలా కలసికట్టుగా ఏలిన కలల సామ్రాజ్యాలు
వైజయంతిమాల కళ్ళల్లోంచి వెయ్యేళ్ళ కిందటి జ్ఞాపకాలు
ఒక కృష్ణశాస్త్రి ఒక తిలక్ ఒక దేవదా ఒక మజ్నూ
పరకాయప్రవేశం చేసి ఈ తనువు జ్వలించిన తన్మయాలు

ఇప్పుడు కాదు
కలల జలతారు కళ్ళను కప్పిన కాలేజీ రోజుల్లో


(ప్రతి వ్యక్తి జీవితంలోనూ మరచిపోలేని బంగారు రోజులు కాలేజీ రోజులు.సరదాలూ,సంతొషాలూ తప్ప బాధ్యతలూ,బంధాలూ లేని ఆ రోజుల్ని తల్చుకుని)

భాను(1984)

Sunday, August 26, 2007

మౌనగానం


నీవు లేనప్పుడు
నీపై పాటలతో
నా గదంతా పులకించిపోతుంది.

అదేం చిత్రమో!
నీవు ఎదుట నిలుచుని
నన్నో పాట పాడమంటే
నా గొంతు పెగలి రాదు.
కానీ
నా హృదయంలో
ఎన్నెన్ని వీణలు పాటలు పాడతాయనీ!

నీ హృదయం ఆ పాటలు వింటోందని
నిర్మల తటాకాల్లాంటి నీ కళ్ళు
నాతో చెబుతాయి.

Thursday, August 23, 2007

ఒక వెన్నెల రాత్రి


ఈ రాత్రి
ఆకాశం పాలసముద్రంలా ఉంది
పూలకెరటంలా ఉంది
విచ్చుకున్న మల్లెపువ్వులా ఉంది
స్వచ్ఛమైన మనిషి మనసులా ఉంది

పాల మీగడనూ పూలపరాగాన్నీ
మంచిగంధాన్నీ మల్లెపువ్వుల్నీ
దారాలు దారాలుగా పేని
ధరిత్రీ ఆకాశమూ కలసి
ధవళ వస్త్రాన్ని నేస్తున్నాయి

పచ్చ పువ్వులా వెన్నెల
పసిపాప నవ్వులా వెన్నెల
పరిమళపు మత్తులా వెన్నెల
కలవరపు కాంక్షలా వెన్నెల

అజ్ఞాత స్వప్నాల్ని వెలిగించే వెన్నెల
అవ్యక్త రాగాల్ని పలికించే వెన్నెల
అపారమైన ప్రేమతో ప్రపంచాన్ని కప్పేసిన వెన్నెల
మహా ఇంద్రజాలంలా మనస్సులను కమ్మేసిన వెన్నెల

తీగలు తీగలుగా వెన్నెల
తీయని గానంలా వెన్నెల
పాయలు పాయలుగా వెన్నెల
మోయలేని హాయిలా వెన్నెల

ఈ రాత్రి
వెన్నెల మడుగులోకి దూకి
చీకటి ఆత్మహత్య చేసుకుంది.






భానుమూర్తి(1981)

స్మృతి


అనుభూతుల మంచు బిందువుల మాటునో
మత్తుగా కళ్ళు విప్పే
నా జ్ఞాపకాల గులాబీతోట



మెత్తగా
పుప్పొడిలా
సుతారంగా జారే
నీ పరీమళపు దరహసం

గుండె లోతుల్లో
ఉండుండి వినిపించే నీ పాట
నా కళ్ళ నుండి కన్నీరై ప్రవహిస్తుంది.






భానుమూర్తి(1979)
(ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితం)

Monday, August 20, 2007

ఒక నిశ్శబ్ద సముద్రం ఒడ్డున




అలా కూచుని ఉంటాను

ఈ గాలీ మాట్లాడదు
ఈ నేలా పలకదు
ఈ చెట్టూ కదలదు ఈ చిలుకా పాడదు

గాఢంగా
ఓ ఘనీభూత నిశ్శబ్దం నన్నావరించి ఉంటుంది

నేనప్పుడు
ఊరవతల పాడుపడిన సత్రపు మొండిగోడలా ఉంటాను
నడివేసవి మధ్యాహ్నం కదలాడని గాలి బరువులా ఉంటాను
కాలిపోయిన కలల వేడికి మాడిపోయిన దిగులు చూపులా ఉంటాను

ఉన్నట్టుండి క్షితిజరేఖపై ఓ బుల్లి పడవేదో కదులుతుంది
మెదడు మూలల్లో తళుక్కుమని మెరిసే నీ జ్ఞాపకం

ఈ గాలి గాలంతా హోరెత్తిపోతుంది
వానకు తడిసిన మట్టి పరిమళం లోంచీ ఈ నేల నా పాటను ఎగరేస్తుంది
వొయ్యారంగా ఊగిపోయే చెట్టు తన చిగురాకుల లావణ్యంలో నా పాటను మెరిపిస్తుంది
చిలుకల గుంపులన్నీ బారులు బారులుగా ఆకాశంలో నా పాటను రాస్తూ పోతాయి

అప్పుడు నేనెలా ఉంటానో తెలుసా

కొండల్ని తొలుచుకుని దూకే ఉధృత జలపాతంలా ఉంటాను
లక్ష నక్షత్రాలు పొదిగిన ఆకాశంలా ఉంటాను
వేలవేల దీపాలు కట్టి వెలిగించిన తోరణంలా ఉంటాను

సరిగ్గా అప్పుడే ఎవరో నా భుజంపై చేయి వేసినట్టు తోస్తుంది
వెనక్కి తిరిగి చూస్తే
స్వచ్ఛంగా నవ్వుతూ
దగ్గరిగా స్పృశిస్తూ
అంతటా అన్నిటా తానే అయిన నా పాట.

చెట్టూ మనిషీ

చెట్టూ మనిషీ


చెట్టు లాగా విస్తరించటం మనిషికీ చాతనవుతుంది
పచ్చని చైతన్యంతో
పరిసరాలను ప్రాణవంతం చేయటం కూడా

బ్రతుకొక నిరంతర గ్రీష్మ మధ్యాహ్నమైన వాళ్ళనీ
కొడవళ్ళుగా నాగళ్ళుగా మగ్గాలుగా పగ్గాలుగా సుత్తులుగా సమ్మెటలుగా
జీవితమొక అవిశ్రాంత శ్రమావరణమైన వాళ్ళనీ
కొమ్మల స్నేహ హస్తాలతో పిలచి సేద తీర్చటమూ
చల్లటి నీడలో ఆత్మల్ని ఆనందింపచేయడమూ
మనిషికీ చాతనవుతుంది
చెట్టు లాగే

తన సమస్త జీవసారాన్ని ఒక అమృతఫలంగా మార్చి
ఆకలిగొన్న నోటికి ఆప్యాయంగా
అమ్మలాగా అందించటం కూడా
మనిషికీ చాతనవుతుంది
చెట్టులాగే

అయితే

పచ్చటి చైతన్యాన్ని ప్రసరింపచేయటమయినా
చల్లటి వాత్సల్యాన్ని ఒడిలా పరవడమయినా
వొకింత తీయని పండుగా అస్తిత్వాన్ని ఫలింపచేయటమయినా
చెట్టు లాగే
భూమిలోకి బలంగా వేళ్ళు పాతుకున్న మనిషికి మాత్రమే చాతనవుతుంది


పైపైకి పాకిపోయే తీగల్లాగా
అలంకారానికి మాత్రమే పుష్పించటం
అందరు మనుషులకీ చాతనవుతుంది




భానుమూర్తి(1996?)
రంజని పోటీలో బహుమతి పొందిన కవిత

Sunday, August 19, 2007

ఎక్కడున్నావు నా కలా

మబ్బుల్ని గుండెల మీదకు లాక్కుని
పడుకునే కొండల్లాగా
నీ జ్ఞాపకాల్ని కప్పుకుని పడుకుంటాను

చుట్టుముట్టే నిరాశల చలిలో
నీ స్మృత్యగ్ని కణాలు రగిల్చే వెచ్చదనం

ఉదయమయే కొద్దీ ఒక్కో కలా వీడ్కోలు చెప్పి నిష్క్రమిస్తుంది

ఆఖరి నక్షత్రం ఆకాశాన్ని వదిలేటప్పుడు
వెనక్కి తిరిగి ఏదో చెప్పబోయి హటాత్తుగా మాయమౌతావు

మళ్ళీ ఓ యుగం లాంటి పగలు గుండెను అదుముతుంది

కలలకు బద్ధలైన కళ్ళలోంచి నెత్తురో కన్నీరో
తెలిసిన నీవు మాత్రం కలగా మిగిలావు



భానుమూర్తి(1982)

ఎచటనో నీవు,నేనిచట....


మెదడు మొహంజొదారోలో తవ్వకాలు సాగిస్తున్నాను
ఈ అవ్యక్త పరిమళపు జన్మ రహస్యం కోసం

అక్షాంశ రెఖాంశాల మధ్య
తమను తాము విభజించుకున్న దేశాలు మనవి
ఇక్కడ ఎవడూ ఇంకొకడి వైపు కన్నెత్తి చూడడు
ఇక్కడ కన్నుల్లో అనుమానం అపనమ్మకం తప్ప
మరే భావమూ పలకదు

ఏ భూతం
ఏ కాలం
ఏ భూతకాలం మనల్ని కలిపిందో

మెదడు మొహంజొదారోలో తవ్వకాలు సాగిస్తున్నాను
ఈ అవ్యక్త పరిమళపు జన్మ రహస్యం కోసం

హఠాత్తుగా నా తలుపు తట్టిన అతి కోమలాంగుళల కోసం
అంతు పట్టని కీకారణ్యాలు గాలిస్తున్నాను
రక్కసి ముళ్ళ మధ్య రోజా కోసం

శిల్పాలు చెక్కే చేతుల్ని శిలువ వేసే ఈ నేలలో
ఈ శిలను స్ప్రుశించిన ఉలి కోసం వెతుకుతున్నాను
జఢంగా పడి ఉన్న బండ రాళ్ళ మధ్య జక్కన కోసం

మెదడు మొహంజొదారోలో తవ్వకాలు సాగిస్తున్నాను
ఈ అవ్యక్త పరిమళపు జన్మ రహస్యం కోసం

మౌనంగా వెతికితే వెర్రితనం
వెర్రిగా అరిస్తే అభ్యుదయం
విలువలు తారుమారైన ఈ వ్యవస్థలో
ఈ వెర్రివాడిని కలవరించే వ్యక్తి కోసం

ఊరేగించే శవం పైన విసిరేసే పైసల కోసం
పరుగెత్తే పసిపిల్లల మూక ప్రపంచం
దూరంగా నిలబడి మౌనంగా చూసే నా కోసం
దగ్గరవాలని ప్రయత్నించే నీ కోసం

మెదడు మొహంజొదారోలో తవ్వకాలు సాగిస్తున్నాను
ఈ అవ్యక్త పరిమళపు జన్మ రహస్యం కోసం




భానుమూర్తి(1980)

Saturday, August 18, 2007

జ్ఞాపకాలు

జ్ఞాపకాలు


జ్ఞాపకాలు మిగులుతాయి చివరికి

వసంతం వెళిపోతూ వెళిపోతూ
గుప్పెడు పూలు రాల్చి పోతుంది

పరిమళం మాత్రం మిగులుతుంది చివరికి

బాటలు చీలే చోట బరువెక్కిన గుండెలు మూలుగుతాయి
వీడ్కోలు కౌగిలిని విడిపించుకోలేక
వేళ్ళు ఉద్విగ్నంగా చలిస్తాయి
కలసి నడిచిన అడుగుల్ని తలచుకుని కళ్ళు రెండు సముద్రాలవుతాయి

కలలు మాత్రం మిగులుతాయి చివరికి

తీరాన్ని వదలి పడవ దూరదేశాలకు ప్రయాణమౌతుంది
గాలిలో కోలాహలం క్రమంగా దూరమౌతుంది
ఒడ్డునున్న ఇసుక మీద ఒంటరితనం దీనంగా నిలబడుతుంది

సముద్రపు హోరు మాత్రం మిగులుతుంది చివరికి

పచ్చని చెట్ల గుబుర్లలోంచి పక్షి ఎగిరిపోతుంది
పాట మాత్రం మిగులుతుంది చివరికి

జ్ఞాపకాలు మిగులుతాయి చివరికి



భానుమూర్తి (1984)