Monday, August 20, 2007

చెట్టూ మనిషీ

చెట్టూ మనిషీ


చెట్టు లాగా విస్తరించటం మనిషికీ చాతనవుతుంది
పచ్చని చైతన్యంతో
పరిసరాలను ప్రాణవంతం చేయటం కూడా

బ్రతుకొక నిరంతర గ్రీష్మ మధ్యాహ్నమైన వాళ్ళనీ
కొడవళ్ళుగా నాగళ్ళుగా మగ్గాలుగా పగ్గాలుగా సుత్తులుగా సమ్మెటలుగా
జీవితమొక అవిశ్రాంత శ్రమావరణమైన వాళ్ళనీ
కొమ్మల స్నేహ హస్తాలతో పిలచి సేద తీర్చటమూ
చల్లటి నీడలో ఆత్మల్ని ఆనందింపచేయడమూ
మనిషికీ చాతనవుతుంది
చెట్టు లాగే

తన సమస్త జీవసారాన్ని ఒక అమృతఫలంగా మార్చి
ఆకలిగొన్న నోటికి ఆప్యాయంగా
అమ్మలాగా అందించటం కూడా
మనిషికీ చాతనవుతుంది
చెట్టులాగే

అయితే

పచ్చటి చైతన్యాన్ని ప్రసరింపచేయటమయినా
చల్లటి వాత్సల్యాన్ని ఒడిలా పరవడమయినా
వొకింత తీయని పండుగా అస్తిత్వాన్ని ఫలింపచేయటమయినా
చెట్టు లాగే
భూమిలోకి బలంగా వేళ్ళు పాతుకున్న మనిషికి మాత్రమే చాతనవుతుంది


పైపైకి పాకిపోయే తీగల్లాగా
అలంకారానికి మాత్రమే పుష్పించటం
అందరు మనుషులకీ చాతనవుతుంది




భానుమూర్తి(1996?)
రంజని పోటీలో బహుమతి పొందిన కవిత

No comments: