Thursday, August 23, 2007

ఒక వెన్నెల రాత్రి


ఈ రాత్రి
ఆకాశం పాలసముద్రంలా ఉంది
పూలకెరటంలా ఉంది
విచ్చుకున్న మల్లెపువ్వులా ఉంది
స్వచ్ఛమైన మనిషి మనసులా ఉంది

పాల మీగడనూ పూలపరాగాన్నీ
మంచిగంధాన్నీ మల్లెపువ్వుల్నీ
దారాలు దారాలుగా పేని
ధరిత్రీ ఆకాశమూ కలసి
ధవళ వస్త్రాన్ని నేస్తున్నాయి

పచ్చ పువ్వులా వెన్నెల
పసిపాప నవ్వులా వెన్నెల
పరిమళపు మత్తులా వెన్నెల
కలవరపు కాంక్షలా వెన్నెల

అజ్ఞాత స్వప్నాల్ని వెలిగించే వెన్నెల
అవ్యక్త రాగాల్ని పలికించే వెన్నెల
అపారమైన ప్రేమతో ప్రపంచాన్ని కప్పేసిన వెన్నెల
మహా ఇంద్రజాలంలా మనస్సులను కమ్మేసిన వెన్నెల

తీగలు తీగలుగా వెన్నెల
తీయని గానంలా వెన్నెల
పాయలు పాయలుగా వెన్నెల
మోయలేని హాయిలా వెన్నెల

ఈ రాత్రి
వెన్నెల మడుగులోకి దూకి
చీకటి ఆత్మహత్య చేసుకుంది.






భానుమూర్తి(1981)

9 comments:

కొత్త పాళీ said...

"ఈ రాత్రి
వెన్నెల మడుగులోకి దూకి
చీకటి ఆత్మహత్య చేసుకుంది."

ఈ ముగింపు పద్యానికి మకుటాయమానం :-)

వెన్నెల రాత్రిని కళ్ళకి కట్టారు.

భాను said...

ధన్యవాదాలు.కవిత మీకు నచ్చినందుకు అనందంగా ఉంది.

భాను

భాను said...

మీకో విషయం చెప్పాలి.ఈ కవితలో ఇంకా రెండు చరణాలు ఉండేవి.

జననాంతర సౌహృదాల జ్ఞాపకాల జాజిపూలు
జలజలమని రాలుతున్న జలపాతం వెన్నెల
గగనం చుంబించాలని ఎగసిపడే కడలి గుండె
కదలాడే మధురోహల కలగానం వెన్నెల

అని. ఎందుకో అవి సంధర్భోచితంగా తోచక వదిలేశాను.మీరేమంటారు?

GKK said...

భానన్నియ్యా, మీ కవితలు చాలా బాగున్నాయి. మంచి భావుకత. సంక్లిష్టత లేదు. ఇంత కాలానికి బ్లాగుల్లో మంచికవితలు చదివిన తృప్తి. ఒక చిన్న అనుమానం. పుచ్చపువ్వా? పచ్చపువ్వా?

భాను said...

తెలుగు అభిమానికి,

ధన్యవాదాలు.నా కవిత్వం నచ్చినందుకే కాదు.ఆత్మీయమైన అన్నయ్యా అన్న పిలుపుకు కూడా.అది పచ్చ పువ్వే.

oremuna said...

చాలా బాగుది

ఆ వదిలేసిన నాలుగు లైన్లు కూడా బాగున్నాయి, కాకపోతే భాషలో కొద్దిగా తేడా ఉండటం వల్ల వదిలేసినారా?

మీరు ఇలాగే ఇంకా కొన్ని వ్రాస్తే చదివి ఆనందించాలని ఆశిస్తూ,

భాను said...

oremuna గారూ,

ధన్యవాదాలు.మీ పేరు తెలుగు బ్లాగులలొ చాలా చోట్ల చూసి మీ తెలుగు అభిమానానికి ముగ్ధుడనయ్యాను.మీరు నా బ్లాగు కూడా చూడడం,నా కవిత్వం మీకు నచ్చడం చాలా ఆనంద దాయకం.ఒక రకంగా మీరన్నది నిజమే.భాష మారడమే కాదు, ఆ నాలుగు పంక్తులూ మాత్రా చంధస్సులో నడిస్తాయి.మిగతా కవిత అంతా వచన కవిత్వమే అయినా ఒక శయ్యా, తూగు ఉంటాయి differentగా.బహుశా అందుకే అవి వదిలేద్దామనిపించింది.

మెహెర్ said...

"ఈ రాత్రి
వెన్నెల మడుగులోకి దూకి
చీకటి ఆత్మహత్య చేసుకుంది."

మొదట ఈ కవిత అపనమ్మకంతో ప్రారంభించి, కొన్ని చోట్ల skip చేస్తూ చివరి దాకా వచ్చేసాను. (ఎందుకంటే సాధారణంగా ప్రకృతి మీద కవితలన్నీ Cliched wordings తో నిండి ఉంటాయి. కానీ ఈ చివరి వాక్యం దగ్గరకొచ్చేసరికి, ఒకసారి ఆగి, సంభాళించుకుని, మరలా మొదటినుంచీ చదివాను. బావుంది.

Naga said...

కిరణ్ (ఒరెమునా) గారి బ్లాగు నుండి ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది కవిత. మనిషి, పసిపాప, వెన్నెల-లతో కలిసి ఉన్న పదాలన్నీ బాగా నచ్చాయి.