Sunday, September 2, 2007

రాత్రి కురిసిన వర్షం


అర్ధరాత్రి చెంపలపై ఆత్మీయపు తడి తగిలి లేస్తే
కిటికీ అవతల వర్షం కురుస్తోంది
తెల్లని పువ్వయి విచ్చుకున్న ఆకాశపు హృదయం నుండీ
సౌహార్ద్రం జాల్వారినట్లు వాన
జననాంతర సౌహృదాలేవో జలజలా మేల్కొలుపుతుంది

అర్ధరాత్రి కిటికీ లోంచీ వర్షాన్ని చూస్తుంటే
తెలియని రసప్రపంచపు రహస్య ద్వారమేదో తెరచుకున్నట్లుంటుంది
నీలిరంగు చీకటిలో నీడలు కదలాడినట్లు
మార్మిక ఛాయలేవో మనసును కలవరపెడతాయి

తడిసిన మట్టి వాసనతో గాలి శరీరాన్ని చుడితే
సాంద్రమూ సన్నిహితమూ అయిన స్వప్నమేదో స్పర్శించినట్లుంటుంది

సగం తెరిచిన కిటికీ రెక్కపై చిత్రమైన సంగీతాన్ని ధ్వనించే చినుకులు
నిద్రకూ మెలకువకూ మధ్య నిలిచి
నిర్ణిద్ర గానాన్ని వినిపిస్తున్నట్లుంటుంది
మంద్రస్థాయిలో వినిపించే జంత్రవాయిద్యపు సంగీతవిభావరిలో
తన్మయమై పోయిన మనస్సు
తెలియకుండానే పొలిమేర దాటి నిద్రలో జోగుతుంది
తెరలు తెరలుగా దృశ్యం అదృశ్యంలోకి మాయమయినట్లుగా

తెల్లారి లేచి చూస్తే_
అప్పుడే తలంటు పోసుకుని కురులారబెట్టుకుంటున్న జవ్వనిలాగా
పచ్చని కాంతితో ప్రపంచం కిటికీ లోంచీ స్వఛ్చంగా నవ్వుతుంది
రాత్రి అనుభవాల్ని గుండెలో జ్ఞాపకాలుగా పదిలపరచుకున్నట్టు
గడ్డిపూల మీద మెరిసే నీటిబిందువులు.

10 comments:

మెహెర్ said...

"తడిసిన మట్టి వాసనతో గాలి శరీరాన్ని చుడితే..." ఇక్కడ్నించీ మీ కవిత సజీవ దృశ్యమై నా మస్తిష్క ఫలకంపై కదలాడింది. 'ఒక కవిత నాణ్యతకు నిజమైన కొలతప్రమాణం మన వెన్నులోంచి పైకి పాకే జలదరింపు' అంటాడు Vladimir Nabokov. మీ ఈ కవితలో అది ఉంది. Loved it. Keep rocking like this.

, said...

ఫణింద్ర కుమార్ గారు,
మీకు రష్యన్ సాహిత్యంతో పరిచయం వున్నట్టుంది.
యెవరెవరి రచనలు చదివారు?

భాను said...

ఫణీంద్ర గారూ,

నా కవిత్వం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.మీలాంటి రసజ్ఞులూ, సహృదయులూ అందించే ప్రోత్సాహమే నా కవిత్వానికి ప్రాణవాయువు.

భాను

GKK said...

కోకిలలను జేబులోవేసుకొని తిరుగుతూ (శేషేన్ద్ర) మబ్బులతో మాట్లాడటం మీకు చాతనవ్వు.

భాను said...

తెలుగు అభిమానికి,

మీ అభినందనలకు కృతజ్ఞతలు.శేషేంద్ర మీకూ ఇష్టమేనా?ఆయనది అద్భుతమైన ఇమేజరీ.
"శబ్దాన్ని ఎవడలా ఎత్తాడు మధుపాత్ర లాగా
తప్పకుండా వాడు కవి అయ్యుంటాడు"
ఎంత గొప్పగా అన్నాడు కదూ!అవునూ, మీ బ్లాగు చూసే భాగ్యం మాకు లేదా?

భాను

Anonymous said...

బావుంది. ఏ ఇంటర్నెట్ మాగజైన్లకో పంపితే ఎక్కువ మంది చదివి ఆనందిస్తారేమో!

భావకుడన్ said...

చాలా బావుంది మీ కవిత. భావుకత పెల్లుబుకుతోంది మీ కవితలో, అందులోను కవితలో నాకు ఎంతో ఇష్టమైన "ఒంటరితనం" కూడా ఉండటంతో చాలా నచ్చింది.

"ఒ వర్షం కురిసిన రాత్రి" తిలక్ కవిత నెట్లో దొరుకుతుందేమో అని గూగులమ్మను అడిగితే మీ కవితను చూపించింది. ఎంత మంచిదో ఈ గూగులమ్మ.

మీరు రాసి చాలా రోజులే అయినా ఇపుడే చూసాను కాబట్టి రాస్తున్నాను వ్యాఖ్య, మీకు అందుతుందో లేదో తెలియదు.

భావకుడన్ said...

అయ్య బాబోయ్, ఆ మహానుభావుడి రచనను "అమృతం కురిసిన రాత్రి" నుండి "వర్షం కురిసిన రాత్రి" కి మార్చేసినందుకు క్షమించాలి అందరు.

Bolloju Baba said...

మీ కవితపై
నాస్పందనను
http://nemechchinaraatalu.blogspot.com/2008/04/bhanu.html లో ఉంచాను వీలైతే చూడండి.

నాబ్లాగు చూసి మీ కామెంట్స్ చెయ్యరూ?
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/

మురారి said...

>>అర్ధరాత్రి కిటికీ లోంచీ వర్షాన్ని చూస్తుంటే
తెలియని రసప్రపంచపు రహస్య ద్వారమేదో తెరచుకున్నట్లుంటుంది
>>మంద్రస్థాయిలో వినిపించే జంత్రవాయిద్యపు సంగీతవిభావరిలో
తన్మయమై పోయిన మనస్సు
తెలియకుండానే పొలిమేర దాటి నిద్రలో జోగుతుంది.
>>తెల్లారి లేచి చూస్తే_
అప్పుడే తలంటు పోసుకుని కురులారబెట్టుకుంటున్న జవ్వనిలాగా
పచ్చని కాంతితో ప్రపంచం కిటికీ లోంచీ స్వఛ్చంగా నవ్వుతుంది

చాలా చాలా బాగుంది.