Wednesday, January 14, 2009

జీవితాన్ని కోల్పోయిన మనిషి

ఆవర్తాలు ఆవర్తాలుగా ఈ పాట ఇలా ఎగసి పడుతూ ఉండాల్సిందేనా

తెల్లారంగానే ఉలిక్కిపడి లేచి
పక్కచుట్టూ రాలిపడ్డ పచ్చిపూల స్వప్నాల్ని
భయం భయంగా ఏరుకుని
ఎవరూ చూడకుండా మళ్ళీ కళ్ళల్లో కుక్కుకుని
ఈ ముఖాల మురికి కాల్వల వెంటా
చిందరవందరయిన జీవితాల చెత్తకుప్పల వెంటా
మళ్ళీ మళ్ళీ మానని గాయం లాంటి పగటి యుధ్ధం

కెరటాలు కెరటాలుగా ఈ సముద్రం ఎగిరిపడుతూ ఉండాల్సిందేనా

స్వప్నమూ గాయపడుతుంది
సంగీతమూ రోదిస్తుంది
దీపస్తంభం క్రింద క్రీనీడలు భయపెడతాయి
ప్రశ్నలకేం చాలా ఉన్నాయి
ఒక అసహాయ అస్తిత్వపు అఖాతంలోకి
జీవితాన్ని వేలాడేసుకుని
కాళ్ళు తపతపా కొట్టుకోవడం మినహా

మరణాలు మరణాలుగా ఈ జీవితం ఉలికి పడుతూ ఉండాల్సిందేనా

జాలిచూపు వెన్నెల స్రవించే జాబిల్లి కన్నులూ
కాంతి చిరునవ్వులు పూచే వెలుతురు పూల ముఖాలూ
చాచిన స్నేహాలై విస్తరించే ఆత్మీయపు చేతులూ
కల్మషం లేని కపటం లేని
మోసం లేని ద్వేషం లేని దుర్బలత్వం లేని రాజీ లేని
సౌహార్దపు దీపాలై వెలిగే మానవ శరీరాలూ

స్వప్నాలు స్వప్నాలుగా ఈ మెలకువ చిట్లిపోతూ ఉండాల్సిందేనా

ఫ్రపంచం కోసం స్వప్నించే కళ్ళు రక్తాన్ని స్రవిస్తాయి
ప్రభుత్వాన్ని శాసించే నోళ్ళు బ్రతుకును హరిస్తాయి
తొణికిన జీవన మాధుర్యం
మండే ఎడారి వర్తమానంలో ఇంకిపోతుంది
జీవితాన్ని కోల్పోయి ఉనికి మాత్రం మిగిలిన మనిషి

కన్నీరు కన్నీరుగా ఈ కన్ను కరిగిపోతూ ఉండాల్సిందేనా

5 comments:

Anonymous said...

Bhanu gaaru:

anukokundaa mee blog loki choopu pettaanu.

mee kavitwam baagundi. saandramgaa, aardramgaa...

afsar

Bolloju Baba said...

సైక్లికల్ గా వ్రాసే ఇలాంటి కవితలు ఎక్కువ లోతుగా గుచ్చుకొంటాయి. గుండెల్ని తడిమి గుప్పెడు ప్రశ్నలు చేతిలో పెట్టిపోతాయి.
నడచొచ్చేసిన బాటను ఒకసారి విశ్లేషించుకొమ్మని హెచ్చరిస్తాయి.

మీ కవిత్వాన్ని నేను అభినందించటం, తారలను మిణుగురు మెచ్చుకోవటం లాంటిదే.

గత ఏడాది ఒక కవిత మాత్రమే వ్రాసారని మాత్రం ఇక్కడ నేను చెప్పదలచుకొన్నాను అంతే.

భవదీయుడు

రాధిక said...

బాబాగారి మాటలే నావీను.

కొత్త పాళీ said...

మీరు మళ్ళీ కనిపించినందుకు సంతోషం
చ్క్కటి కవితతోఅహా వచ్చినందుకు మరీ సంతోషం

ఆత్రేయ కొండూరు said...

భాను గారు ఏమనటానికి నాకు మాటలు రావటంలేదు. మధురంగా ఉన్న దేన్నైనా ఆస్వాదించగలం గానీ ఎలా ఉందో మాటల్లో చెప్పలేము. అద్భుతంగా ఉంది. అంతకంటే పెద్ద మాట నాదగ్గర లేదు క్షమించండి.