Friday, September 26, 2008

ఆశయాల చిటారు కొమ్మన వెలిగే కాంతి పుష్పం స్వప్నం
సత్యం చేయడానికి సాహసం కావాలి
పరచుకున్న అనేకానేక మరణాల్ని నిలబెట్టి
ఒక జీవితం చెయ్యడానికి సాహసం కావాలి

సంశయ సముద్ర కల్లోలం లో నమ్మకాల నౌక భగ్నమైనప్పుడు
కడ దాకా ఈదే రెక్కల సాహసం కావాలి
ఒకటొకటే రాలిపడే నక్షత్రాల్ని చూసి ఒంటరి ఆకాశం చీకటైనప్పుడు
ఒక ఉదయంగా వెలగడానికి సాహసం కావాలి

అదృశ్య ఖడ్గప్రహారాల మధ్య అజేయంగా నిలవడమే జీవితమైనప్పుడు
గాయాల్ని గౌరవించడానికి సాహసం కావాలి

10 comments:

Bolloju Baba said...

స్వప్నం ఒక కాంతిపుష్పం ఎంత అందమైన భావన. పుష్పం అన్నప్పుడే అందులో ఒక ఆశ, మరొక తరం, కనపడతాయి.
స్వప్నం అంటే కూడా అంతే కదా.

మరి ఆ స్వప్నాన్ని ఎలా సత్యం చేసుకోవాలో కవి ఇలా చెపుతున్నాడు.

మరణాల్ని నిలబెట్టాలట. నిస్పృహతోనో, బద్దకంతోనో నిద్దురపోవటమంటే మరణమే కదా. మరి ముందు మరణాల్ని నిలబెట్టాలి.

నౌక భగ్నమైనప్పుడు, నడి సంద్రం కల్లోలాల మద్య ఈదగలిగే వాడే సాహసి. ఒడ్డు చేరగలిగే వాడే విజేత. ఆ సముద్రం, ఓడా మామూలువా కాదుగా - ఒక సంశయ సముద్రం, నమ్మకాల నౌక. ఎంత అందమైన భావనలండీ.

నిజమే మరి గాఢాంధకారమలముకొన్నపుడు ఒక ఉదయంగా వెలగటానికి ఎంత సాహసం కావాలి మరి.

ఊహించని గాయల పాలయే జీవితంలో, గాయాల్ని కూడా గౌరవించుకోవటానికి సాహసం కావాలనటం ఒక్క కవి మాత్రమే చెప్పగలిగే విశిష్ట భావం.
అది కూడా ఒక్క భాను గారు మాత్రమే.

గొప్ప కవిత చదివించారండీ.

చిన్న విన్నపం. తరచూ కాకపోయినా అప్పుడప్పుడన్నా రాస్తూండండి.

బొల్లోజు బాబా

భావకుడన్ said...

భాను గారు,

చాలా బావుంది-నిజంగా బాబా గారు చెప్పినట్టు "సంశయాల సాగరం -నమ్మకాల నౌక" చాల గొప్ప ఉపమానం.

కవిగా మీరు రాసిన పాదాలపై మీ వ్యాఖ్య, వివరణ వినాలని కుతూహలంగా ఉంది-వివరించగలరా ముఖ్యంగా "పరుచుకున్న మరణాలను ......." అన్నా పాదాన్ని.

శీర్షిక పెట్టలేదు, ఏదైనా ప్రత్యేక కారణమా?


బాబాగారు,
మీ వివరణ చాలా బావుంది.

భాను said...

బాబా గారూ,

నా స్పందనను మీ బ్లాగులో పోస్ట్ చేశాను. ధన్యవాదాలు.

భావుకుడన్ గారూ,

మీలాంటి వారి మెప్పు కొత్త ఉత్సాహాన్ని కలిగించి మొద్దు బారిన మనసును మళ్ళీ కవిత్వం వైపు లాగుతుంది.రోజువారీ బ్రతుకులో ప్రతి వైఫల్యమూ ఒక మరణమే కదా.కానీ అంతటితో జీవితం ఆగిపోదు. ఫీనిక్స్ పక్షి లాగా కాలి భస్మమయినా తిరిగి రెక్కలతో పైకి లేవడమే కదా విజయమూ, నిజమైన జీవితమూ!

shaneer babu said...

భాను గారూ ఇప్పుడేచదివాను మీ కవిత... చాలా బావుంది..ఆఖరి రెండు లైన్లు సూపర్బ్....

ప్రతాప్ said...

అవును కావలసింది అందుకోవాలంటే ధైర్యం కావాలి.
కడదాకా పోరాడే తత్త్వం కావాలి.
వెన్ను చూపని దమ్ము కావాలి.
చిరాకు పలకరించలేని ఓపిక కావాలి.
ఇన్ని సత్యాలను చాలా చక్కగా చెప్పారు. ఒక మంచి భోజనం చేసిన తృప్తి మీ బ్లాగును సందర్శించాక కలిగింది. అందుకు ముందుగా బాబా గారికి ఆ తర్వాత మీకు కృతజ్ఞతలు.

Anonymous said...

చాలా బాగుంది.

Sasik said...

ఒక కప్పు టీ, ఒక పఫ్ సిగరెట్ అని రాసినా, ఒక ఉదయంగా వెలగడానికి అవసరమయ్యే సాహసం గురించిరాసినా, మీరు చాలాచక్కగా రాస్తారు. మంచి పాజిటివ్ కవిత ఇది. మాతో కవితను పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు!

కొత్త పాళీ said...

ఏమైపోయారు సార్, ఇన్నాళ్ళు? రాసిన కవిత్వాన్ని గిన్నెలో పోసి నిప్పు మీద పెట్టి ఇన్నాళ్ళూ మరిగించి మరిగించి అప్పుడు దాన్ని వడపోసి ఈ కవిత వెలయించినట్టున్నారు. లేకుంటే ఇంత చిక్కదనం రాదు. ఈ పద్యం, మీ ఈతర పద్యాలకంటే వేరే మెట్టుమీద ఉంది.
ఎనీవే .. గుడ్‌ టు సీయూ అగేన్‌.

చైతన్య.ఎస్ said...

"గాయాల్ని గౌరవించడానికి సాహసం కావాలి " అదిరింది భాను గారు.

మురారి said...

చాలా బాగుంది.