Monday, October 22, 2007

నాకు నేను, నాకై నేను రాసుకున్న లేఖ

రేయ్ భానూ,

అవ్యక్తపుటాలోచనలూ,అస్పష్టమైన కలలూ,అంతుపట్టని ఉద్రేకాలూ ఎక్కడికి నడిపిస్తాయి నిన్ను? ఎడతెగని,కడలేని నీ నిరంతర యాత్ర ఏ స్వప్న సీమా సౌందర్యం కోసం? నాకు తెలుసు, నీ హృదయం విచిత్ర విచిత్ర వర్ణాల ఊహల ఇంద్రధనుస్సులు చిత్రీకరించుకున్న ఆకాశం;కలల పువ్వులు నిండుగా విరబూసిన పూలతోట. నాకు తెలుసు - నీ హృదయం తీరని వాంఛలతో, అలౌకికమైన కాంక్షలతో తెలియని తీరాలనుంచి వినవచ్చే ఏ పిలుపులకో చలించి,గాలి తాకిడికే ఉలిక్కి పడే,ఊగిసలాడే ఒక రసజ్వాల. ఒక ఉన్మత్త సముద్రం.
నిదురలో నవ్వే పసిపాప పెదవులపై తొణికిసలాడే అమాయకత్వాన్ని నువ్వు ప్రేమిస్తావు. మంచు తుంపరల వెనక మెల్లగా కళ్ళు విప్పే మల్లె పూలని నువ్వు ప్రేమిస్తావు.ఇంద్రియానందాన్నధిగమించి అతీతమైన దైవత్వాన్ని అందుకునే దేహసౌందర్యాన్ని నువ్వు ఆరాధిస్తావు. అర్ధరాత్రి ఆకాశంలో నక్షత్రాలు మాట్లాడుకునే రహస్యాల్ని నువ్వు శోధిస్తావు.జీవితాన్ని నువ్వు దోసిళ్లతో అమృతధారలాగా ఆస్వాదిస్తావు. మరి దేని కోసం వెర్రిగా వెతుకుతావు?

అవును.నేనర్థం చేసుకోగలను.స్వర్గసీమా ప్రాంగణంలోనుంచీ తేలి వచ్చే అప్సరల అమరగానం కోసం ప్రతి గొంతు వైపూ ఆశగా చూస్తావు. హాయిగా పుష్పించే చిరునవ్వుల కోసం ప్రతి పెదవి వైపూ ఆశగా చూస్తావు. చల్లగా,నిండుగా పలకరించె దయామయ దృష్టుల కోసం ప్రతి కంటినీ దీనంగా పరిశీలిస్తావు. మెత్తగా,తల్లిలా లాలించే వొడి కోసం ప్రతి చేతుల్నీ అభ్యర్థిస్తావు. నాకు తెలుసు.నువ్వు ప్రేమిస్తావు. నీ హృదయాన్ని లోకం ముందు హాయిగా విసిరేస్తావు. నిజంగా నువ్వు ప్రేమిస్తావు.

నువ్వు దేవున్ని ప్రేమిస్తావు.శిలువ పై జీసస్ స్రవించిన రక్తాన్ని తలచుకుని నీ కళ్లు రెండు సముద్రాలవుతాయి. నీ హృదయం ఒక వర్షామేఘమే అవుతుంది. కైలాస శిఖరాగ్రాన తాండవించే నటరాజును తలచుకుని నీ శరీరం పులకించిపోతుంది. నీ గుండె పొంగే సముద్రమే అవుతుంది. ప్రచండ ఝంఝానిలమే అవుతుంది.అపార కరుణామయుడయిన అల్లాను తలచుకుని నీ హృదయం కృతజ్ఞతతో చేతులు జోడిస్తుంది.నీ శిరస్సు అవనతమవుతుంది. అవును, నువ్వు దేవున్ని ప్రేమిస్తావు.మసీదును ప్రేమిస్తావు.మందిరాన్ని ప్రేమిస్తావు.చర్చిని ప్రేమిస్తావు.అవును, నువ్వు మనుషుల్ని ప్రేమిస్తావు.

ఒరేయ్ వెధవా ___ నిజంగా చెబుతున్నాను. ఈ లోకం ద్వారా నిన్ను నువ్వు ప్రేమిస్తావు.
భాను(1990)