Sunday, March 29, 2009

నీతో ఓ వెన్నెల రాత్రి

జవరాల!
లలిత లలితమ్మయిన నీ నవ్వు
తొలి మంచు తెర వెనక
తెలి మల్లె పువు రేకలను విచ్చినటు
తరగలై వెన్నెలలు భువి కప్పినటు

బరువు బరువుగ గాలి
పరిమళము మోసికొని
నిండు చూలాలు నిట్టూర్చినటు
ఈ రేయి వెన్నెల కన్నె
బరువు గాలికి పైట జార్చినటు

చెంత చేరిన ప్రియుడు
మంద మలయానిలము
సెలకన్నె చెక్కిలిని మీటినటు
గలగలల సెలకన్నె పులకించి
చెలునితో గుసగుసలు పలికినటు

వలపు నవ్వులు నవ్వు చెలియ!
నీ అంగుళుల
స్పృశియించి పులకించు
ఇసుక రేణువు కాగ
నా ఎడదనొక తలపు!

(1984)