
(ఈ గేయం 1991లో రాసింది.హైదరాబాద్ మహానగరం 400 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రంజని సంస్థ నిర్వహించిన పోటీలో ప్రశంస పొందింది. అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పేమీ లేదనే అనుకుంటా.)
తళుకు తగరపు వయ్యారపు నవ్వులూ
జిలుగు మెరుపుల కాగితపు పువ్వులూ
తోరణాలు తోరణాలుగా పరచుకున్న నాలుగు శతాబ్దుల కాలమూ
ఇదేనా మహానగరం?
ప్రతి రోడ్డు కూడలి లోనూ
ప్రజల్ని పరామర్శించే పెద్ద పెద్ద హోర్డింగులూ
ప్రతి సాయంత్రమూ
పార్కుల్లో పబ్లిక్ గార్డెన్లో రవీంద్రభారతిలో
హోరెత్తే మీటింగులూ
కామరూపం ధరించిన రాక్షసుడిలాగా
నగరం తనను తాను అలంకరించుకుంటోంది
దిక్కు తెలియక తిరనాలలో తప్పిపోయిన అనామకునిలా
అన్నింటిలోనూ వెతుకుతున్నాను
నగర జీవన స్పర్శ కోసం_
ఎక్కడా తగలదు
మెరుపుల తోరణాలూ వెలుతురు కిరణాలూ
రంగురంగుల స్వప్నాలూ సరే
దాచబడ్డ సత్యాల్ని చెప్పేదెవరు?
గాయపడ్డ హృదయాన్ని విప్పేదెవరు?
చూసీచూడనట్టు ప్రవహించే మూసీ నది చెబుతుందా?
అజ్ఞానం పేదరికం మరిపించే మత్తు మతం
ఆడుకున్న నెత్తుటి వసంతాలనుండీ ఇంకా మేలుకోలేదు మూసీ*
నయగారపు కవ్వింతల నటనల మెహందీ చెబుతుందా?
ఆకలి పన్నిన కుట్రలోంచీ ఇంకా మూల్గుతూనే ఉంది మెహందీ చీకటిలో నాగరికత తనకంటించిన మరకలనే
వెలుతురులో నగరం అసహ్యించుకోవడం
అర్థం కాని అయోమయంలో అలమటిస్తూంది మెహందీ
కాలం ఘనీభవించి కట్టడంగా మిగిలిపోయిన
చార్మినార్ మాత్రం ఏం చెప్పగలుగుతుంది?
నగరం నాలుగు దిక్కులకీ తాను సాక్షి అయినందుకు
కళ్ళు పొడుచుకుంటోంది
ప్రభుత్వాలూ ప్రతిపక్షాలూ
విడివిడిగా కలివిడిగా చేపట్టే ఉమ్మడి విధ్వంసక కార్యాల్లో
ఏ కాలిపోయిన బస్సులు చెబుతాయి
ఏ ఆగిపోయిన రైళ్ళు చెబుతాయి
పోగొట్టుకున్న ఉద్యోగాల గురించీ
దక్కని ఆఖరి చూపుల గురించీ
ఎదురు చూపుల గుప్పిట్లో గజగజలాడే గుండెల గురించీ
ఎవరూ ఏమీ చెప్పరు
ఏదీ ఏమీ పలకదు
సజావుగా జీవితం సాగుతున్నట్టే ఉంటుంది
ఉదయసాయంత్రాలు
ఆఫీసులకీ ఇంటికీ మధ్య సాగే మహాప్రవాహం
ఒక మహా యుద్ధాన్ని తలపిస్తూనే ఉంటుంది
నగరం నాగుపాము పడగ మీద మెరిసిపోయే మణి లాగా
బిర్లాటెంపుల్ ధగధగలాడుతూనే ఉంటుంది
పెంటకుప్పల మధ్యా చింకిపాతల మధ్యా
కిళ్ళీమరకల మధ్యా సిగరెట్ పీకల మధ్యా
ఇరానీహోటల్ వంటగది సొరంగాల మధ్యా
అనాగరిక బాల్యం అజ్ఞానపు యవ్వనంలోకి వికసిస్తూనే ఉంటుంది
*******
బాబూ
ఇది నగరం
మాయలాడి మహానగరం
మాయలేడి మా మహానగరం
చూడగలిగే కళ్ళే నీకుంటే
టాంక్ బండ్ మీద పల్లీలమ్ముకునే కుర్రాడి కళ్ళల్లో
నగరజీవితం తన నగ్నత్వాన్ని ఆవిష్కరిస్తుంది.
* (1990-91 లో ఒక నెల పాటు భయానక మతఘర్షణలు జరిగాయి)